Tuesday, March 27, 2007

సుందర కాండ 13వ సర్గ

వానర వీరుడు ఆలోచించుచు
మేఘము వీడిన మెరుపు వలె
పుష్పకమును వెంఠనె వొదిలి
కోట గోడపై అంచును చేరెను 1

రావణ భవనము వెనకనే వదిలి,
సీతను గానక కృంగిన మదితో
దూరము వెళ్ళి ఆలోచించుచు
ఈవిధముగా తనలో పలికెను 2

"రాముని కిచ్చిన మాటను నిలుపగ
లంకను మొత్తము కలియ తిరిగితిని
విదేహ రాజ్యపు రాచ బిద్దను
సీతను మాత్రము కనుగొన కుంటిని 3


నదులు, కొలనులు, శెలయేళ్ళు, చెరువులు
అడవులు, కొండలు మరి జలాశయములు
కఠిన దారులు గలిగిన శిఖరములు
సీత కొరకై ఒక్కటొదలక అన్ని తిరిగితి 4

పక్షి రాజగు శంపాతి చెప్పెను
రావణ గృహమున సీత కలదని
మాట నమ్మితి, అంత వెదికితి
సీతను మాత్రము కనుగొన జాలితి 5

విదేహ రాజగు జనకుని పుత్రిక
మిథిలా నగరమున పుట్తిన సీత
రావణ బలముకు వివశురాలై
అతనికి లొంగి ఉండలేదు కదా ? 6

రామ కోదండమునకు భయపడి
అసురుడు సీతను తీసుకు పోయేటప్పుడు
వేగము తాళక భయమును ఓర్వక
సీత క్రిందకు పడి పోలేదు కదా? 7

సిద్ధులేగు గగన మార్గమున
సీతను తీసుకు వెళ్ళేటప్పుడు
జలధిని చూసి కోమలి సీతకు
భయపడి గుండె ఆగలేదు కదా? 8

తనను లాగిన రావణ బలముకు
అతని భుజములు పెట్టిన క్షోబకు బలియై
సుందర నయనయగు శ్రీమతి సీత
ప్రాణము వదిలి ఉండదు కదా? 9

రావణ చెరనుండి విముక్తి కొరకై
సీత వేదనతో గింజు లాడగా
తాపుకు బెడిసి పట్టు దొరకక
జలధిలో మునిగి వుండబోదు కదా ? 10


బందుగులెవ్వరు దరిలో లేక
రాముని మనమున నింపి ఉంచుకుని
మానరక్షణము చేయుచునుండగ
ఈ అసురుడు సీతను మ్రింగలేదు కదా ? 11

అసితేక్షణ యగు సీత సుందరతకు
కన్నులు చెదిరి కక్షను కట్టి
ఈర్ష్యయు రగిలిన రావణ పత్నులు
ఆమెను విందుగ ఆరగించలేదు కదా? 12

ఇందు వదనయగు సీతా మాత
కలువ కన్నులుగల జనక సుత
రాముని ముఖమును మదిలో నింపి
ప్రాణ త్యాగము చేయలేదు కదా? 13

విదేహ పుత్రియగు సాధ్వి సీత
హా రామా!! హా లక్ష్మణా!! ఓ అయోధ్యా
ఎలుగెత్తేడ్చుచు, ఆక్రోశించుచు
దేహము విడిచియుండలేదు కదా ? 14

లొంగని సీతను మార్చుట కొరకై
రావణ గృహమున మాతగు సీతను
పక్షిని గూటిలో పెట్టిన విధముగ
పంజరమందున బంధించి వుండలేదు కదా ? 15

జనక మహీపతి పుత్రిక
దశరధ రాముని ప్రియ సతి
శింహ మధ్య కమల దళాక్షి
రాక్షస కట్టడి ఓర్వ గలదా ? 16

సీతను కనుగొన లేదని
మాత మనకిక లేదేమోనని
చేసిన యత్నము కల్లయని
రామునికేరీతి చెప్పగలను? 17

వార్తను చెప్పిన తప్పగు
నిజమును మ్రింగిన తప్పగు
విషమ స్థితి లో చిక్కితి నేను
కాగల కార్యమేరీతి చేయవలె? 18


ఈ కార్యము అగమ్యముగ సాగుతున్నది
కాలము ఒక వైపు మించుచున్నది
నేనేరీతి ఇప్పుడు వ్యవహరిచవలె ?
నా తక్షణ కర్తవ్యమేమి కావలె ? 19

సీతను చూడక ఏమియు చేయక
కిష్కిందకేరీతి నే చేరగలను ?
చేసిన యత్నము పడిన శ్రమయు
బూడిద పోసిన పన్నీరాయె కదా ? 20

జలధిని దాటితి, లంకను చేరితి
సీతను వెదుకుతూ కాలము గడిపితి
రాక్షస బలమును తేరి చూసితి
అంతయు ఇప్పుడు వ్యర్ధము కాదా ? 21

లంకను వీడి, కిష్కింద చేరి
దశరధ సుతులకు ఏమి చెప్పుదు ?
ఆశలు నాపై పెంచుకు చూసెడి
వానర వీరులకేమని చెప్పుదు ? 22

సీతను చూడని విషాద వార్తను
రాముని కేవిధి నే చేర్చ గలను ?
ఆశతో చూసెడి రాముడీ వార్తను
వినిన వెంఠనే ప్రాణము వదులును 23

పరుషము, దారుణము, క్రూరము
తీక్షణమైన, సీతను కనుగొనలేదన్న
దుర్వాక్యము విన్న రాముండు
అసువులు బాయకుండునా ? 24

క్షోబలొ వున్న అన్నగు రాముని చూసి
అన్ననే మనమున దేవుని చేసి
ఎల్ల వేళలా పూజలు చేసెడి
లక్షమణుడికపై బ్రతక గలడా ? 25

రామ లక్ష్మణుల మరణ వార్తను
తెలిసిన భరతుడు శత్రుఘ్నుడును
సోదర వియోగము ఓర్వక నిజముగ
ప్రాణ త్యాగము చేయక మానరు 26

నల్గురు పుతృల మరణము చూసి
మాతలు కౌసల్య సుమిత్ర కైకేయియు
హృదయ విదారకముగ రోదన చేయుచు
ప్రాణము వదులుట తధ్యము 27

వట్టిచేతులులతో తిరిగి వెళ్ళిన,
చేసిన ప్రమాణము భగ్నము కాగ
రామ లక్ష్మణులకు మరణము రాగ
సుగ్రీవుడు తప్పక ప్రాణము వదులును 28

సుగ్రీవు ప్రాణము వదులుట చూసి
విగత మనసుతో రోదన చేయుచు
సుఖమగు జీవనకు తనకు తగదని
భార్య రూమయు ప్రాణము వదులును 29

వాలి వధతో సగము చచ్చియు
సుగ్రీవు రాజుగ చూసి ఊరడిల్లెడి
తారయు, అతని మరణము చూసి
అసువులు బాయుట, అప్పుడు తధ్యము 30

మాతా పితలను మృతులుగ చూచుచు
విగత జీవులగు దశరధ సుతుల గని
విరిగిన మనసుతో రాకుమారుడు
అంగదుడింకను బ్రతికుండ గలడా ? 31

ప్రభువుల మరణము ఎదురుగ చూసి
సుగ్రీవుని సేవకు అంకిత మైన
వానర వీరులు బాధతొ కృంగి
తలలు బాదుకుని ప్రాణము లిత్తురు 32

చిన్న బహుమతులు ప్రియమగు మాటలతో
ప్రభువగు సుగ్రీవు ప్రేమను పొందిన
మిగిలిన వీరులీ విషాద ఘటనను చూసి
విరిగిన మనసుతో అసువులు వదులును 33

అడవిలొ గంతులు వేసెడి మూకలు
కొండ గుహలలో ఆడెడి కోతులు
చెట్ల నీడల తిరిగెడి వీరులు
ఆ రీతి ఇకపై స్వేచగ ఉండజాలరు 34

భార్యా బిడ్డల సహితము మంత్రులు
తమ ప్రియతమ వీరుల మరణమువిని
ఆక్రోసించెడి హృదయము గలిగి
చరియల పైకెక్కి దూకుట తధ్యము 35

విషమును త్రాగి, మంటల దూకి
ఉరిని పోసుకుని కత్తితో కోసుకుని
వివిధ రకములుగ వేదన చెంది
వానర వీరులు ప్రాణము లిత్తురు 36

ఇక్ష్వాకు వంశ నాశము
వానర జాతుల విషాద మరణము
లంకను వదిలి నే కిష్కింద చేరిన
నిస్సంకోచముగ జరిగి తీరును 37

అందువలననే నే సీతను చూడక
ఆశలు నాపై నిడుకుని బ్రతికెడి
వీరుల ప్రాణము నిలిపగ నేను
కిష్కింద చేరను, సుగ్రీవుని చూడను 38


నేను ఇచటనే ఉండిపోయిన
మహా వీరులగు దశరధ సుతులు
సుగ్రీవాది వానర వీరులు
ఆశతోనైనా తప్పక బ్రతికును 39


సీతను చూడక ఇచటే ఉంటూ
చేతికి అందినదేదో తింటూ
సముద్ర తీరపు పరిసరాలలో
వాన ప్రస్థమును తీసుకుందును 4041

లేక చితిని ఒకటీ ఇచటే పేర్చి
అగ్నిన దూకి ప్రాణము వదిలెద
లేక తిండి తిప్పలు మాని వేసి
వదిలిన దేహము పక్షులకేసెద 42

ఋషులు మునులు అంగీకరించిన
ప్రాణమొదులుటకిది తగిన మార్గము
సీతనికను చూడకున్న
నే నీట మునిగి ప్రాణమొదిలెద 43

సీతను లంకన కనుగొన లేదన్న
మచ్చ నాకిక తప్పక వచ్చును
నాకున్న పూర్వపు మంచి పేరు
ఈ మచ్చ తోటి కరిగి పోవును 44

అశితేక్షిణను చూడక నే
లంకను ఇప్పుడు విడివ జాలను
సన్యసించెద నిచటనే
కంద మూలముల నాశ్రయించెద 45

సీతవిషయము ఏమియు తెలియక
లంకను వదిలి తిరిగి వెళ్ళిన
ఎదురు చూసెడి అంగద వీరులు
ప్రాణ త్యాగము తప్పక చేతురు 46



ప్రాణ త్యాగము మహా పాపము
శుభములు జరుగును ప్రాణములున్న
బ్రతికి ఉన్నచో ఆశయు బ్రతుకును
అందువలననే ప్రాణము వదలను" 47

పరిపరి విధముల ఆలోచనలతో
బాధ నిండి బరువెక్కిన హృదయముతో
సంకట స్థితిలో ఒంటరి వాడై
మారుతి దుఃఖిత మనమున ఇటులాలోచించెను 48

"లేని పక్షమున సీతకు ఏమై ఉండినప్పటికి
అందుకు ప్రతిగా, ప్రతీకారముతో
అమిత విక్రముడు దశకంఠుడునగు
రావణ హతకుని నేను చంపెద 49

అలా కాని యెడ, ఈ రావణు
జలధిని దాటి ఆవలి ఒడ్డుకు
జంతువునీడ్చిన రీతిగ నేను
రాముని చెంతకు తప్పక చేర్చెద" 50

సీతను చూడని బాధలొ హనుమకు
అలోచన లన్నియు ఒక తరి వచ్చి
గజిబిజి గందర గోళము కాగ
దీర్ఘ శ్వాసతో స్థిమితము పొందెను 51

"రాముని పత్నగు సీతా మాత
లంకలొ నాకిక దొరికే వరకు
రావణ పాలిత నగరము లోన
మరల మరల నే శోధించెదను 52

సంపాతి చెప్పిన మాటలే రుజువుగ
రాముని లంకకు తెచ్చితినేని
సీతను చూడక క్రోధముగలిగి
వానర సేనను భస్మము చేయును 53

కంద మూలములు మితముగ తింటు
ఇంద్రియ నిగ్రహము తోడుగ చేసి
సీతను వెదుకుతు ఇటనే ఉంటే
వానర మూకలు క్షేమముగుందురు 54

ఇప్పటివరకు నే వెదకని చోటు
అతి సుందరమగు చెట్టులు నిండిన
అశోక వనమిక మిగిలి ఉన్నది
అచటకేగి మాత కోసమై తిరిగి వెదకెద 55

అష్టవసువులకిదియె వందనము
రుద్రాదిత్యులకు ప్రణామములు
అస్విని మరుతులకివే నమస్కృతులు
అసురుల భరతమిక నేను పట్టెద 56

రాక్షస మూకకు ఓటమినిచ్చెద
సీతను తోడ్కొని రాముని కిచ్చెద
ఘోర తపమును చేసెడి మునికి
తపః ఫలము నిచ్చిన తీరుగ" 57

దుఃఖపు మబ్బులు తునకలు కాగ
తేజఃపుంజము కన్నుల మెరవగ
మనః క్లేశము ఆహుతి కాగ
మారుతి లేచెను దీక్షిత మనస్కుడై 58

"రామ లక్ష్మణులకు నా నమస్సులు
జనకాత్మజకివె నా వందనములు
రుద్రేంద్ర యమ వాయువు లకు ప్రణతులు
సూర్యచంద్ర మరుద్గణాలకు నా దణ్ణములు" 59

అందరికీవిధి వందనమిడుకుని
శుగ్రీవుని మనమున ప్రేమతొ తలచి
నాల్గు దిక్కులు ఒక పరి చూసి
అశోక వనముకు నడచెను మారుతి 60

వనము వైపునకు వడిగా నడచుచు
చేయగలిగిన కార్యములేవని
మనమున మారుతి ఆలోచించుచు
ఈవిధి తనలో తాను తలచెను 61

లెక్కకు మిక్కిలి రక్షక భటులు
పళ్ళునిండిన మహా వృక్షములు
వివిధ జాతులకు చెందిన వారు
పవిత్ర అశోక వనమున ఉందురు 62

రాక్షస మూకల బలమును చూసి
వాయువు కూడ మెల్లగ వీచును
దేహము చిన్నది చేసిన నేను
సీతను కనుగొన వనమున చేరుదు 63

ఋషులు దేవత్లు ఆసీస్సులతొ
నా కార్యము సిద్ది చేయుదురు గాక
స్వయంభువుడగు బ్రహ్మయు
దేవులు విజయము నాకు ఇత్తురు గాక 64

అగ్నియు తండ్రగు వాయు దేవుడు
వజ్రాయుధమును పట్టిన ఇంద్రుడు
పాశ హస్తుడై వరుణుడు నా ఈ
కార్యము సఫలము చేయును గాక 65

మండెడి సూర్యుడు చల్లని చంద్రుడు
మహానుభావులు అస్విని దేవులు
మరుద్గణములు ఈస్వర సహితులై
నాకిట సిద్ధిని ఇత్తురు గాక 66

సకల చరాచర ప్రాణికోటికి
దృస్యాదృస్య జీవుల తండ్రగు
పరమ పావన పరంధాముడీ
కార్యము సఫలము చేయును గాక 67


తెల్లని పలు వరుసతొ, నల్లని విసిరిన కురులతొ
పద్మదళములబోలు కన్నులతొ
సుందర వదనారవిందగు మాతను
సీతను ఎప్పుడు చూడగలను ? 68

రావణుని చేత అపహరించబడినదియు
బలమున ఇచటకు తేబడినదియు
వికలిత మనసుతొ ఆభరణ త్యజితగు మాతను
సీతను ఎప్పుడు చూతును నేను ? 69